జగనన్న చేదోడు: ఒక్కో అకౌంట్‌లోకి రూ.10వేలు..

ఏపీలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. బుధవారం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ)లకు రూ.10వేలు జమ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ)లకు ఇచ్చిన నిలబెట్టుకున్నాను అన్నారు ముఖ్యమంత్రి జగన్.

ఎవరికైనా షాపు ఉండి, అర్హత ఉండి పథకం అమలు కాకపోయినా పర్లేదు.. డబ్బులు జమ కాకపోతే అలాంటి వారికి మరో అవకాశం కల్పించారు సీఎం జగన్. అర్హత ఉన్నవాళ్లు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లి అర్హతలు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక నెల పాటూ గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు.. వారికి వచ్చే నెలలో డబ్బు జమ చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా, తనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే పథకం అందుతుందన్నారు.

ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడారు.. లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. ఈ డబ్బును లబ్దిదారులు తమ వృత్తికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.