జూన్ 21న యుగాంతం.. మళ్లీ తెరపైకి మయాన్ క్యాలెండర్…

2012లో యుగాంతం వచ్చేసింది. ఇక ప్రపంచం అంతం అయిపోతుందంటూ పెద్ద దుమారం లేచింది గుర్తుంది కదా. పురాతన మయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ వాదన అప్పట్లో చేశారు. 2012 డిసెంబర్ 21న యుగాంతం వచ్చేస్తోందని పుకార్లు లేచాయి. చివరకు అవి ప్రజల్లో పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ పేరు చెప్పి హాలీవుడ్ మాత్రం బాగా క్యాష్ చేసుకుంది. 2012 సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన కలెక్షన్లు వసూలు చేసింది. ఆ సినిమా చూసిన వారు యుగాంతం ఇలాగే ఉంటుందేమో అనే అనుకున్నారు. అయితే, తాజాగా అదే మయాన్ క్యాలెండర్ ప్రకారం మరో వాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో మయాన్ క్యాలెండర్‌ను పొరపాటుగా చదివారట. వాస్తవానికి అది 2020 అయితే, పొరపాటున 2012 అని చదివారట. ప్రస్తుతం వారు చెబుతున్న వాదన ప్రకారం 2020 జూన్ 21న యుగాంతం వచ్చేస్తోంది. అంటే వచ్చే ఆదివారమే.

జూలియన్ క్యాలెండర్ ప్రకారం మనం 2012లోనే ఉన్నాం. జూలియన్ క్యాలెండర్  నుంచి మనం గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి రావడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గుతుంది. 1752 నుంచి 2020 వరకు అంటే 268 సంవత్సరాలు. సంవత్సరానికి 11 రోజులు చొప్పున తగ్గాయి కాబట్టి 268ని 11తో గుణిస్తే (Multiply) 2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి, ఆ 2948ని 365తో భాగిస్తే (Division) 8 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన 2020లో 8 సంవత్సరాలు తీసేస్తే 2012లోనే ఉన్నట్టు లెక్క అని సైంటిస్ట్ పాలో టగోల్గన్ ట్వీట్ చేసినట్టు సన్ పత్రిక కథనాన్ని వెలువరించింది. అయితే, ఈ లెక్క తప్పు అవుతుందా? నిజం అవుతుందా? అనేది వారం ఆగితే తెలిసిపోతుంది.