వీళ్లు ఆక్సిజన్ తీసేశారు డాడీ.. చచ్చిపోతున్నా డాడీ.. బాయ్ డాడీ..

తెలంగాణలో ఓ యువకుడు చనిపోయే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన వారు కంటతడిపెట్టించేలా ఉంది. ‘నేనేం చెప్పిన డాడీ.. చంపేస్తారు డాడీ. పోతే రిటన్ రాను డాడీ అని చెప్పిన గదా. ఊపిరి ఆడడం లేదంటే కూడా చెప్తే వినకుండా ఆక్సిజన్ బంద్ చేశారు. బితిమిలాడి బతిమిలాడి సాలు సాలు (విసుగు) అవుతుంది. ఇప్పటికి మూడు గంటలు అయింది డాడీ. నాకు ఊపిరి అడతలేదు. గుండె ఆగిపోయింది. ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుంది డాడీ. బాయ్ డాడీ బాయ్. అందరికీ బాయ్ డాడీ.’ అంటూ ఆ యువకుడు చెబుతున్న వీడియో చూస్తే కంటతడిపెట్టించేలా ఉంది. ఆ సెల్ఫీలో యువకుడి ముక్కు ముందు ఆక్సిజన్ ట్యూబ్ కనిపిస్తోంది. బాధితుడు చెప్పిన దానిబట్టి అందులో ఆక్సిజన్ సరఫరా కావడం లేదని అర్థం అవుతోంది.

తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అయిన వివరాల ప్రకారం ఈ వ్యక్తి మేడ్చల్ జిల్లాకు చెందిన వాడు. ఎన్టీవీ కథనం ప్రకారం.. ఈనెల 24 వ తేదీన ఆ యువకుడు జ్వరం బాధపడుతూ ఛాతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. మరణించే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈనెల 24 నుంచి జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఛాతి ఆసుపత్రిలో చేర్చగా, 26 వ తేదీ వరకు ఆక్సిజన్ అందించారని, ఆక్సిజన్ మాస్క్ తీసేసిన తరువాత ఊపిరాడక కుమారుడు మరణించాడని తండ్రి పేర్కొన్నాడు. మరణించిన యువకుడి అంత్యక్రియల్లో 30 మంది బంధువులు పాల్గొన్నారు. యువకుడి అంత్యక్రియల తరువాత వచ్చిన కరోనా పరీక్షల ఫలితాల్లో యువకుడికి పాజిటివ్ ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.