‘నాంది’ టీజర్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం..

కచ్చితంగా నాంది టీజర్ చూసిన తర్వాత అంతా ఇదే మాట అంటారు. ఇన్ని రోజులు అల్లరి నరేష్ అంటే ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే గుర్తొచ్చేది. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోకు మళ్లీ క్రేజ్ తీసుకొచ్చింది ఈయనే. చాలా వేగంగా తక్కువ సమయంలోనే 50 సినిమాలు కూడా పూర్తి చేసాడు నరేష్. అప్పట్లో వరస విజయాలతో దుమ్ము దులిపేసాడు కూడా. అయితే కొన్నేళ్లుగా అల్లరోడి సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. అంతగా నిరాశ పరుస్తున్నాయి ఈయన సినిమాలు. 8 ఏళ్ల కింద వచ్చిన సుడిగాడు సినిమానే అల్లరి నరేష్ చివరి హిట్. మధ్యలో దాదాపు డజన్ సినిమాలు నిరాశ పరిచాయి.

దాంతో ఇప్పుడు అల్లరి నరేష్ తన పంథా పూర్తిగా మార్చుకున్నాడు. నటుడిగా 50 సినిమాలు పూర్తి చేసిన తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలి అనుకుంటున్నాడు. ఇదివరకే గమ్యం, ప్రాణం, నేను లాంటి డిఫెరెంట్ సినిమాలు చేసాడు నరేష్. కానీ కామెడీ సినిమాలు హిట్ కావడంతో అలాంటి ముద్రే పడిపోయింది. గతేడాది మహర్షి సినిమా నుంచి మాత్రం తనను తాను మార్చుకుంటున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ఆ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా చాలా ఎమోషనల్ పాత్ర చేసాడు ఈ హీరో. ఇప్పుడు నాంది సినిమాతో మరోసారి తనలోని కొత్తదనం చూపిస్తున్నాడు అల్లరి నరేష్.

ఈ సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇది అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. తాజాగా విడుదలైన ‘నాంది’ టీజర్ చూస్తుంటే నరేష్ ఈ కథను ఎంతగా యిష్టపడ్డాడో అర్థమవుతుంది. నగ్నంగా కూడా నటించాడు ఇందులో. ఖైదీ చేసే న్యాయపోరాటంగా ఈ చిత్రం వస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తే.. ఇప్పుడు టీజర్ అంచనాలు పెంచేసింది. అజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోడానికి నరేష్ నాంది లాంటి సినిమాను ఎంచుకుంటున్నాడు. దాంతో ఇకపై ఇలాంటి సినిమాలే చేస్తాడేమో చూడాలి.