టిక్ టాక్ ఖేల్ ఖతం.. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉన్నా పనిచేయని యాప్..

భారత్‌లో టిక్ టాక్ ప్రస్థానం ముగిసింది. మిషన్ ‘టిక్ టాక్ బ్యాన్’ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించగా.. తాజాగా టిక్ టాక్ పూర్తిగా పనిచేయడం లేదు. కొత్తగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేకపోగా.. ఫోన్లలో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు పనిచేయడం లేదు. స్క్రీన్‌పై ‘నో నెట్‌వర్క్ కనెక్షన్’ అని మెసేజ్ చూపిస్తోంది. అన్ని సర్వీస్ ప్రొవైడర్లు తమ నెట్‌వర్క్ నుంచి ఈ యాప్‌ను తొలగించాయి. టిక్ టాక్‌ యాప్ సర్వర్‌కు కనెక్ట్ కాకుండా ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. దాంతో ఇక భారత్‌లో టిక్ టాక్ జర్నీ ముగిసింది. టిక్ టాక్ పనిచేయకపోవడంతో సోషల్ మీడియాలో Rip Tiktok ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి.

కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.