రూ.400 మందులిచ్చి రూ.3.55 లక్షల బిల్లు వేశారు.. కరోనా బాధితుడి ఆవేదన

కరోనా భయంతో ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే.. ఇదే అదనుగా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి తెరలేపాయి. ఇష్టానుసారం బిల్లులు వేస్తూ కరోనా బాధితులను దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు వసూలు చేయకుండా..ఏవేవో పేర్లు చెప్పి భారీగా దండుకుంటున్నాయి. తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఏకంగా మూడున్నర లక్షల బిల్లు వేసింది. 16 రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని కేవలం రూ.400 మందులు మాత్రమే ఇచ్చారు. కానీ ఫైనల్ బిల్లు మాత్రం లక్షల్లో వేశారు. ఇప్పుడా బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కరోనా బారిన పడిన 38 ఏళ్ల వ్యక్తి మే 28న కట్టనంకులాతుర్‌లోని SRM మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యాడు. 16 రోజుల పాటు అతడికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జూన్ 13న డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి సమయంలో ఆస్పత్రి సిబ్బంది వేసిన బిల్లు వేసి అతడు షాక్ అయ్యాడు. ఏకంగా రూ.3,55,595 బిల్లు వేశారు. ఐతే అన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంటే కేవలం రూ.405 మందులు మాత్రమే అతడికి ఇచ్చారు. ఇదేంటి 4వందల మందులు ఇచ్చి మూడున్నర లక్షల బిల్లు వేశారంటూ నిలదీశాడు. కానీ ఏవేవో చార్జీలు చెప్పి మొత్తం వసూలు చేశారు.